రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. నిన్న ఉన్నట్టుగా నేడు ఉండదు. నేడు న్నట్టుగా రేపు ఉండదు. వ్యక్తిగతంగా ఎదిగేందుకు నాయకులు ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంది. దీంతో పార్టీలనే నమ్ముకోక తప్పని పరిస్థితి కూడా వారికి ఎదురవుతుంది. అయితే.. ఆ పార్టీలు తమకు అన్యాయం చేస్తున్నాయని.. తమకు గౌరవం ఇవ్వడం లేదని భావించే వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. దీంతో కొందరు నాయకులు అటు-ఇటు అంటూ.. వివిధ పార్టీలు మారుతున్నారు.అయితే.. అందరికీ అన్నీ ఉండనట్టుగానే.. కొందరు మహిళా నాయకుల పరిస్థితి డోలాయమానంలో పడింది. అంటే.. వారేదో ఊహించుకున్నప్పటికీ.. అది జరగదు. పోనీ.. ఉన్న పార్టీలో అయినా.. ప్రశాం తంగా ఉన్నారా? అంటే అది కూడా లేదు. పోనీ వేరే పార్టీలోకి జంప్ చేద్దామంటే అది కూడా కుదరదు. ఇలా.. వన్ వే ట్రాఫిక్‌లో చిక్కుకున్న నాయకామణులు చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకురాళ్లతోపాటు.. కొత్తగా వచ్చిన వారు కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం.ఉదాహరణకు.. మేకతోటి సుచరిత: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకుని జగన్ జమానాలో మంత్రి అయ్యారు. కానీ.. గత ఏడాది ఆమెను తాడికొండకు పంపించడంతో హర్ట్ అయ్యారు. తర్వాత ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీలో అన్యమనస్కంగానే కొనసాగుతున్నారు పార్టీ మారాలని ఉన్నా.. అవకాశం చిక్కడం లేదు. అలాగని పార్టీలోనూ ఉండలేక పోతున్నారు.బుట్టా రేణుక: కర్నూలు మాజీ ఎంపీగా పేరు తెచ్చుకున్న ఈమె కూడా వన్ వే ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వైసీపీలోనే ఉన్నానంటే ఉన్నట్టుగా ఉన్నా.. పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. కానీ చేర్చుకునే పార్టీనే కనిపించడం లేదు. వైసీపీలో ఉన్నా.. సఖ్యత లేక.. మనసు రాక.. నానా తిప్పలు పడుతున్నారు.మీసాల గీత: విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు టికెట్ ఇవ్వలేదన్న కోపం.. సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుతో ఉన్న విభేదాలతో ఆమె టీడీపీని వదిలి బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంటుగా బరిలో నిలిచారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటినుంచి తిరిగి టీడీపీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, అసలు ఆమె ఊసు కూడా ఎవరూ ఎత్తడం లేదు. పోనీ.. వైసీపీ అందామా అంటే.. బొత్స సత్యనారాయణ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. దీంతో ఈమె పరిస్థితి కూడా వన్ వే ట్రాఫిక్ అయిపోయింది.దీపిక: హిందూపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి పరాజయం పాలైన దీపిక.. పరిస్థితి దారుణంగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. 10 కోట్ల రూపాయల వరకు అప్పు తెచ్చి మరీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీలో నాయకుల సఖ్యత లేకపోవడం, అధిష్టానం కూడా.. పట్టించుకోకపోవడంతో రాజకీయంగా తలకిందులు అవుతున్నారు. పోనీ.. ఇతర పార్టీల్లోకి వెళ్లాలంటే.. దారి తెన్ను కనిపించడం లేదు. సో.. ఈమెది కూడా వన్ వేట్రాఫిక్కే. ఇలా.. చాలా మంది మహిళా నాయకులు రాజకీయాల్లో చేసిన చిన్న పొరపాట్ల కారణంగా.. ఇబ్బందులు పడుతున్నారు.

previous post