అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్, జూలై 21:

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి దివ్య కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోగా, ఎల్లమ్మ తల్లి నామస్మరణలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

 

కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. వారికి దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.

 

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య సేవలు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ప్రతి భక్తుడు సులభంగా అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి, దర్శనం చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

 

దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా, ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, ట్రాఫిక్ డీసీపీ కాజల్ సింగ్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, విద్యుత్, రెవెన్యూ, వైద్య, పోలీసు, దేవాదాయ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారు.

 

కళ్యాణ మహోత్సవం అనంతరం కూడా అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *