బడిలోనే టీచర్‌పై పగటిపూట ఘోరం..

బడిలోనే టీచర్‌పై పగటిపూట ఘోరం.. ముసుగులో వచ్చి 27 సార్లు కత్తితో పొడిచి దారుణ హత్య!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పవిత్రమైన దేవాలయం వంటి పాఠశాలలో ఉదయం వేళ దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలిపై ఓ ఉన్మాది విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా సిక్రోనా గ్రామంలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలోనే చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం పూట బహిరంగంగా జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

కలిసేందుకు వచ్చానంటూ పిలిచి క్షణాల్లోనే..

పల్లవి గ్రామానికి చెందిన సంధ్య (30) అనే యువతి సిక్రోనాలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తోంది. సోమవారం ఉదయం సరిగ్గా 9:30 గంటల సమయంలో ఒక దుండగుడు ముసుగు ధరించి పాఠశాల గేటు వద్దకు వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో తనకు సంధ్యతో పని ఉందంటూ బయటకు పిలిపించాడు. ఉపాధ్యాయురాలు సంధ్య గేటు వద్దకు రాగానే, ఏమాత్రం కనికరం లేకుండా తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. ఛాతి, పొట్ట, మెడ భాగాలపై క్షణాల వ్యవధిలోనే వరుసపెట్టి పొడిచాడు.

 

అడ్డుకోబోయిన నిర్వాహకుడికి బెదిరింపులు..

బాధితురాలి ఆర్తనాదాలు విని పాఠశాల నిర్వాహకుడు రక్షించేందుకు పరుగెత్తుకుంటూ రాగా, అతడిపైనా దాడికి తెగబడ్డాడు. దాంతో ఆయన లోపలికి పారిపోవలసి వచ్చింది. అనంతరం కిందపడి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సంధ్య గొంతుపై మళ్లీ మళ్లీ పొడిచి, బయట నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న సంధ్యను పాఠశాల యాజమాన్యం వెంటనే సమీపంలోని అల్ ఫలాహ్ ఆసుపత్రికి తరలించింది. అయితే, ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై ఏకంగా 27 చోట్ల లోతైన కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

 

గంటల వ్యవధిలోనే పట్టుబడ్డ నిందితుడు

ఈ భయానక దృశ్యాలన్నీ పాఠశాల సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న సిక్రోనా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఆధారాలు, స్థానికుల సమాచారంతో నిందితుడు అమిత్ అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు గత కొంతకాలంగా సంధ్యను వేధిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అమిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *