పోరుమామిళ్ల టేకూరుపేట PHCలో DM&HO ఆకస్మిక తనిఖీ
కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
PHCలో ఈ-హెల్త్ రికార్డుల నిర్వహణ, ఫార్మసీలో మందుల నిల్వలు, EDD క్యాలెండర్, వ్యాక్సినేషన్ విభాగం, రోగ నిర్ధారణ ల్యాబొరేటరీలను DM&HO పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సిబ్బంది సమిష్టి బాధ్యతతో పనిచేసి టేకూరుపేట ఆరోగ్య కేంద్రాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.
MCH సేవలపై విస్తృత సమీక్ష
తనిఖీ అనంతరం పోరుమామిళ్ల, టేకూరుపేట, కలసపాడు, నరసాపురం PHCల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో మాతా-శిశు ఆరోగ్యం (MCH), జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై డాక్టర్ యుగంధర్ సమీక్ష నిర్వహించారు.
గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. నిర్దేశిత లక్ష్యాలను 100 శాతం సాధించాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ జె. ప్రవీణ్ కుమార్, RBSK ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్, జిల్లా మలేరియా అధికారి, బద్వేలు డిప్యూటీ DMHO డాక్టర్ మల్లేష్, DPO నారాయణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సాదు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వైద్యాధికారులు డాక్టర్ శైలజ, డాక్టర్ సాయితేజ, డాక్టర్ మేరీ ఎలీషా, డాక్టర్ జయరామ్, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ శ్రీవిద్యతో పాటు PHCల సూపర్‌వైజర్లు, ANMలు, MLHPలు, MPHAలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip: