ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్లో గెజిట్ ధరలే అమలు చేయాలి
కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి
సానుకూలంగా స్పందించిన కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో మున్సిపల్ గెజిట్‌లో నిర్దేశించిన ధరల ప్రకారమే స్టాళ్లలో వస్తువులు, వినోద కార్యక్రమాలకు ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మాజీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్లో నిర్ణయించిన ధరలకు మించి అదనంగా వసూలు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. గెజిట్‌లో పొందుపరిచిన ధరలనే అమలు చేయాలని, ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల హక్కుల కోసం తాను నిరంతరం పోరాడుతున్నానని, ఈ క్రమంలో గతంలో జైలుకు కూడా వెళ్లానని ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో ధరల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కమిషనర్‌ను కోరారు.
గెజిట్ నిబంధనల ప్రకారమే ధరలు: కమిషనర్
ప్రవీణ్ కుమార్ రెడ్డి వినతిపై మున్సిపల్ కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్ సానుకూలంగా స్పందించారు. గెజిట్ నిబంధనల ప్రకారమే ధరలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎగ్జిబిషన్ నిర్వహణలో నిబంధనలు పాటించేలా ముందుగానే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, మున్సిపాలిటీకి ఎలాంటి చెడ్డపేరు రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎం.ఈ., మున్సిపల్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: