AP Elections: రాజకీయం హింసకు దారితీసింది. పోలింగ్ సందర్భంగా మొదలైన పొలిటికల్ వార్.. ఏపీని ఓ కుదుపు కుదిపేసింది. ఏమైంది ఈ రాష్ట్రానికి అనుకునే స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫలితాల తరువాతైనా పరిస్థితిలో మార్పు వస్తుందా ? అంటే డౌటే అనే మాటలు వినిపిస్తున్నాయి.ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాల తరువాత ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. ఇందుకు అసలు కారణం పోలింగ్ తరువాత చెలరేగిన ఘర్షణలు. ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మొదలైన గొడవలు.. ఆ తరువాత మరింత తీవ్రంగా మారాయి. ముఖ్యంగా పల్నాడులో ఈ తరహా గొడవలు జరిగిన తీరు విస్మయానికి గురి చేసింది. తాడిపత్రి, తిరుపతి ఇతర ప్రాంతాల్లోనూ హింసాత్మక ఘటనలు ఆందోళనకు గురిచేశాయి. సాధారణంగా పోలింగ్ రోజు సమస్యాత్మక ప్రాంతాల్లో చెదురుమొదురు ఘటనలు జరగడం సహజమే అయినా.. ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం మాత్రం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి.రాజకీయ కారణాలే ఈ గొడవలకు కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ, టీడీపీలు ఎవరికి వారు తమ ప్రత్యర్థులే ఈ హింసకు కారణమని ఆరోపణలు చేసుకుంటున్నాయి. హింసకు ఈసీనే బాధ్యత వహించాలని ప్రధాన పార్టీలు ఆరోపించాయి. ఏపీలోని ఈ రాజకీయ రణరంగంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం.. సీఎస్, డీజీపీని వివరణ కోరింది. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలు జరిగిన అనేక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక సమస్యాత్మక ప్రాంతాలు పోలీసు పహారాలోకి వెళ్లిపోయాయి.రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది ఈసీ. ఈ ఆందోళనలకు సంబంధించిన ప్రతి కేసును సిట్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఉన్నతాధికారులకు సిట్ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సిట్ నివేదిక తరువాత కూడా చర్యలు ఎలా ఉంటాయి ?.. దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది.ఎన్నికల సమయంలోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడంతో.. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే టెన్షన్ చాలామందిలో కనిపిస్తోంది. ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ, అటు ఎన్డీయే కూటమి ధీమాగా ఉన్నాయి. దీంతో ఫలితాలు వెలువడే రోజు.. ఆ తరువాత ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఫలితాల తరువాతైనా రాజకీయ వేడి తగ్గి.. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడతాయా ? అనే చర్చ జరుగుతోంది. ఫలితాల తరువాత కూడా పొలిటికల్ వార్ ఇదే రకంగా ఉంటే ఏ జరుగుతుందో అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.

next post