కడప జిల్లా మైదుకూరులో ప్రధాని చేసినట్లు ప్రచారంలో ఉన్న “ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దు” అన్న వ్యాఖ్యల నేపథ్యంలో స్వర్ణకారులు నిరసన వ్యక్తం చేశారు. మైదుకూరు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు దొంతు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో స్వర్ణకారులు ర్యాలీ నిర్వహించారు.మైదుకూరు పరిధిలోని తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి ఆందోళనలో పాల్గొన్న స్వర్ణకారులు, బంగారం కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. “బంగారం ఎవరూ కొనకపోతే మా కుటుంబాలు ఎలా బతుకుతాయి?” అని ప్రశ్నించారు.ఇప్పటికే బంగారం ధరలు పెరగడంతో పనులు తగ్గిపోయాయని, ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్వర్ణకారులు తెలిపారు. వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.స్వర్ణకారుల ఉపాధికి ఎలాంటి నష్టం కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మిట్ట జ్యువెలర్స్ సురేష్, కోటా జ్యువెలర్స్ సంజీవరాయుడు, కిరణ్, జమాల్, బాషా తదితరులు పాల్గొన్నారు.

