నెల్లూరు, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరులో దొంగనోట్ల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. రూ.10 లక్షలు నగదు బలవంతంగా లాక్కొని మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంలో చిత్తూరు ట్రాఫిక్ విభాగానికి చెందిన ఏఎస్ఐ లోకనాధం, ఏఆర్ కానిస్టేబుల్ రవిపై కూడా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.పోలీసుల కథనం ప్రకారం, జీడి నెల్లూరు మిట్ట హరిజనవాడకు చెందిన సెల్వం, దేవా, వేలూరుకు చెందిన ఇళంగోవన్ కలిసి దొంగనోట్లు మార్చి ఇస్తామని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మంజు, విజయ్‌లకు ఎర వేశారు. ఈ క్రమంలో బాధితులు రూ.10 లక్షల నగదుతో గంగాధర నెల్లూరుకు వచ్చినట్లు సమాచారం.బాధితులు అక్కడికి చేరుకున్న వెంటనే నగదు తీసుకుని, “పోలీసులం” అంటూ బెదిరించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తాము కొబ్బరికాయల కొనుగోలు కోసం వచ్చిన సమయంలో మోసం జరిగిందని బాధితులు జీడి నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దొంగనోట్ల ముఠా సభ్యులను విచారిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ ఘటనపై గంగాధర నెల్లూరు సీఐ ప్రసాద్ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

