
కడప, జూలై 22: ఖాజీపేట మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో కమలాపురం మండలం పందిళ్లపల్లి సమీపంలో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడగా, ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అపర్ణ, స్రవంతి అనే ఇద్దరు మహిళలను కడప జిల్లా సర్వజన ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, సరైన చికిత్స అందించకుండానే రాత్రి సమయంలో డిశ్చార్జ్ చేశారని బాధితులు ఆరోపించారు. తీవ్ర నొప్పులతో ఆసుపత్రి ఆవరణలోనే ఉండిపోయామని వారు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి బుధవారం జిల్లా సర్వజన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పెంచలయ్య, ఆర్‌ఎంఓ డా. శ్రీనివాస్‌లకు బాధితుల ఫిర్యాదును వివరించి, వైద్యుల నిర్లక్ష్యంపై వ్రాతపూర్వక ఫిర్యాదు చేయించారు.
దీనిపై స్పందించిన ఆసుపత్రి అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, అపర్ణ, స్రవంతిలను తిరిగి ఆసుపత్రిలో చేర్పించి అవసరమైన పరీక్షలు, చికిత్స అందిస్తామని తెలిపారు.
అనంతరం ప్రమాదంలో గాయపడి హిమాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వర్ణలత, ఓబులమ్మలను, శ్రీ శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెంచలమ్మను రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
ప్రమాదంలో మృతి చెందిన కొండమ్మ (47) మృతదేహాన్ని జిల్లా సర్వజన ఆసుపత్రి మార్చురీలో సందర్శించి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గమనిక: ఈ కథనం సంబంధిత రాజకీయ నాయకుడు మరియు బాధితుల ఆరోపణలు, వారి వాదనల ఆధారంగా రూపొందించబడింది. జిల్లా సర్వజన ఆసుపత్రి వైద్యుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: