అమరావతి: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
జూలై 31తో ముగియాల్సిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి కారణాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలకమని మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 15లోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: