నిజామాబాద్: కంకర రాళ్లకు బంగారం పూత పూసి అసలైన బంగారం అంటూ నమ్మించి మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ ఒత్తిడి చేయడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారు రాళ్లు ఉన్నాయని నమ్మించాడు.
అప్పుకు బదులుగా బంగారు రాళ్లను తీసుకోవాలని చెప్పిన శ్రీనివాస్.. డిచ్పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని, అదనంగా రూ.32 వేల నగదు కూడా తీసుకురావాలని రమేష్‌ను కోరాడు. అక్కడ నాలుగు కుండల్లో ఉన్న నాలుగు రాళ్లను బంగారం అంటూ అప్పగించాడు.
అయితే రాళ్లపై అనుమానం రావడంతో పరిశీలించిన రమేష్.. అవి కేవలం కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినవేనని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: