హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లాహౌల్-స్పితి జిల్లాలో పంగీ-కిలాద్ రహదారిపై ఓ వాహనంపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు సమాచారం.
కుల్లు నుంచి పంగీ వైపు వెళ్తున్న టాటా సుమోపై ఒక్కసారిగా భారీ బండరాళ్లు పడటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వాహనం వెనుక భాగంలో మంటలు కూడా చెలరేగాయి. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
కాగా, పంగీ-కిలాద్ రహదారిపై గురువారం కూడా కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలను నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం శుక్రవారం ఉదయం రాకపోకలను పునరుద్ధరించగా.. అదే రోజు మళ్లీ కొండచరియలు విరిగిపడి ఈ విషాదం చోటుచేసుకుంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: