13 ఏళ్ల బాలిక కుట్ర.. ప్రియుడితో తాత హత్య
వీడియో కాల్‌లో హత్యను వీక్షించిన మనవరాలు.. ఐదుగురు మైనర్ల అదుపులో
తిరువనంతపురం: కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 67 ఏళ్ల వృద్ధుడిని ఆయన 13 ఏళ్ల మనవరాలు తన 17 ఏళ్ల ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరుగుతున్న సమయంలో బాలిక వీడియో కాల్‌లో దానిని వీక్షించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.అలప్పుజ ప్రాంతంలో ఆగస్టు 15 రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వృద్ధుడి భార్య తన కుమార్తె ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉండటంతో ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలో బాలిక ప్రియుడు మరో ముగ్గురు మైనర్ బాలురతో కలిసి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు.వారు వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి వృద్ధుడిని బంధించి, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనంతరం ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.హత్య జరిగిన మరుసటి రోజు బాలిక ఏమీ తెలియనట్లు ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. తాత తలుపు తీయడం లేదని స్థానికులకు చెప్పడంతో పాటు సాధారణంగానే షాపులకు వెళ్లినట్లు తెలిపారు. అంతేకాకుండా పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.తొలుత బంగారం మాయం కావడంతో దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించడంతో బాలిక పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విచారణలో ఆమెతో పాటు 17 ఏళ్ల యువకుడు, మరో ముగ్గురు మైనర్ల ప్రమేయం బయటపడినట్లు పోలీసులు తెలిపారు.తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే డబ్బు, ఇతర వ్యక్తిగత కారణాలు కూడా హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు మాదకద్రవ్యాలు వినియోగించారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.మైనర్లందరినీ అదుపులోకి తీసుకుని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యలను జువెనైల్ జస్టిస్ బోర్డు పరిధిలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో వృద్ధుడి కుమార్తె ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనివ్వడం, అదే ఆసుపత్రి మార్చురీలో తండ్రి మృతదేహాన్ని ఉంచడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: