ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గల దాసర్లదొడ్డి బేస్ క్యాంప్ సమీపంలో గురువారం అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగు నాయక్ తెలిపిన వివరాల మేరకు… దాసర్లదొడ్డి వద్ద జరుగుతున్న బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదు మంది ప్రొటెక్షన్ వాచర్ల లో ఒకరైన బొడ్డే వెంకటయ్య పై రెండు పిల్లలను ప్రసవించిన ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేసిన వెంటనే అక్కడే ఉన్న బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తో కలిసి మిగిలిన ప్రొటెక్షన్ వాచర్లు ముగ్గురు ఎలుగుబంటిని చెదరగొట్టారు. ఈ దాడిలో వెంకటయ్య కుడి మోకాలు తీవ్రంగా గాయపడింది. దీంతో అక్కడే ఉన్న ఎఫ్ బి ఓ సుబ్రమణ్యం ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించగా, అటవీ శాఖ వాహనంలో వెంకటయ్యను ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం 108 వాహనం సహాయంతో కడప రిమ్స్కు తరలించామన్నారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

previous post