దువ్వూరులో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం.. రైతులకు కీలక సూచనలు

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కడప/మైదుకూరు : దువ్వూరు మండలం మదిరేపల్లి గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమర్నాథ్ రెడ్డి రైతులకు ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కీలక సూచనలు చేశారు.ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఖరీఫ్‌లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున బోరుబావులపై ఆధారపడి వరి సాగు చేయవద్దని సూచించారు. వరి పంటకు ఎకరాకు సుమారు 1,200 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుందని, బోర్లలో నీటి మట్టం తగ్గి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తెలిపారు.వరి బదులుగా మినుము, పెసర, కంది, జొన్న వంటి అరతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పసుపు, ఉల్లి, మొక్కజొన్న, మినుము పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా నీటిని ఆదా చేస్తూ సాగు చేయాలని రైతులకు సూచించారు.అలాగే పంటలకు ఆగస్టు 15లోపు పంట బీమా చేయించుకోవాలని, ప్రతి రైతు ఫార్మర్ ఐడీ (రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య) తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ గుర్తింపు సంఖ్య అవసరమని వివరించారు.ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మాట్లాడుతూ పీఎండీఎస్ పద్ధతిలో ఎకరాకు సుమారు 5 కిలోల చొప్పున 30 రకాల విత్తనాలను వర్షాధారంగా సాగు చేస్తే పశుగ్రాసం లభించడంతో పాటు వాటిని భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన సహాయకుడు నరసింహులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *