జనసేనలోకి వైసీపీ, సీపీఎం నేతలు.. 300 మందికి పైగా చేరిక

విజయవాడ: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ, సీపీఎం నాయకులతో పాటు విద్యావేత్తలు, విద్యాసంస్థల నిర్వాహకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు బుధవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వైసీపీ నాయకులు మధుసూదన్, కటకం జ్యోతి, ఆల్లూరి శంకర్, మర్రి బెంజిమన్‌, సీపీఎం నేత కొంపెల్ల భాను లక్ష్మి నారాయణతో పాటు పలువురు విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు జనసేనలో చేరారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు గన్నవరం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా పార్టీలో చేరారు. మొత్తంగా సుమారు 300 మంది జనసేనలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చేరికలు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జరిగాయి.
కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు: నాగబాబు
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా ఆదరిస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఆ గుర్తింపు కొంత ఆలస్యమైనా తప్పకుండా లభిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
జనసైనికులకు ఆటోలు.. వీరమహిళలకు కుట్టు మిషన్లు
జనసైనికులు, వీరమహిళలు, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమంలో నాగబాబు పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా 40 మంది జనసైనికులకు ఆటోలు, 25 మంది వీరమహిళలకు కుట్టు మిషన్లు, 25 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, ఏపీఐఐసీ డైరెక్టర్ మండలి రాజేష్, కనకదుర్గ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఠాకూర్ పద్మావతి, హజ్ కమిటీ సభ్యుడు అబిద్, వీర మహిళా విభాగం నాయకురాళ్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మి, పార్టీ నాయకుడు బొలిశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *