మహబూబ్నగర్ జిల్లా, దేవరకద్ర మండలం:
రెవెన్యూ అధికారుల లంచాల వలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమి హక్కుల మార్పిడి కోసం రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరిగే ప్రతి ఒక్కరికీ ఇదే దుస్థితి ఎదురవుతోంది. తాజాగా దేవరకద్ర మండలం బస్వాయిపల్లికి చెందిన ఆటోడ్రైవర్ శంకర్ (35) కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.
శంకర్ తన తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిను తన పేరిట మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఫైలు ఆన్లైన్లో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినా, “ఆఫ్లైన్లో రాలేదు” అంటూ సిబ్బంది అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించాడు.
ఇక ఆర్ఐ సాహత్ ₹15,000 లంచం డిమాండ్ చేశాడని, తనవద్ద లేనందున ₹5,000 ఇచ్చినా మిగతా మొత్తాన్ని ఇస్తేనే దస్త్రం కదులుతుందని చెప్పారని బాధితుడు వెల్లడించాడు.
ఈ వేధింపులకు విసిగిపోయిన శంకర్ తన భార్య జ్యోతి, ముగ్గురు కుమార్తెలతో పాటు తన ఆటోపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోలు మంటలు అంటుకోవడంతో శంకర్ చేతులు కాలిపోయాయి. స్థానికులు అడ్డుకుని పెద్ద ప్రమాదం తప్పించారు.
ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. బాధితుడి కుటుంబం “రెవెన్యూ అధికారుల అవినీతి వల్లే ప్రాణాల మీదకు వచ్చాం” అంటూ విలపిస్తోంది.

