విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని, దేశాన్ని ‘వికసిత్ భారత్’ వైపు నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు లభించాలని కోరుతూ అమ్మవారి సన్నిధిలో ఖడ్గమాల అర్చన నిర్వహించారు.
ఈ సందర్భంగా లింగమనేని రమేష్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత లభిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావడం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
దేశం మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భరమైన దేశంగా అభివృద్ధి చెందాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం సాకారం కావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఖడ్గమాల అర్చన ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్ అజయ్ వర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు ఎం. రామబ్రహ్మం, పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: