విశాఖపట్నం నర్సీపట్నం సిఐ గా ఎల్. రేవతమ్మ బాధ్యతలు చేపట్టిన నాటినుండి రోడ్లపై ఆక్రమణదారుల భరతం పడుతున్నారు గతవారం మెయిన్ రోడ్డు ఆక్రమణలపై దృష్టి పెట్టి మున్సిపల్ అధికారుల సహాయంతో రోడ్లపై ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. తాజాగా బుధవారం కనకదుర్గ గుడి నుండి పోస్ట్ ఆఫీస్ వరకు బైపాస్ రోడ్డులో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సహకారంతో తొలగించారు. ఆక్రమణలను తొలగించడమే కాక, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఎంతోకాలంగా గుంతల రోడ్డుతో ఇబ్బందుపడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రోడ్డుపై గుంతలను మున్సిపాలిటీ జెసిబితో కప్పించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దగల రోడ్డులో గోతులవల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, ఎన్నోసార్లు ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, ఇంత కాలానికి సమస్యను పరిష్కరించిన సీఐ రేవతమ్మకు, మున్సిపల్ కమిషనర్ సురేంద్రకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ జె రమేష్, మునిసిపల్ సిబ్బంది, పట్టణ పోలీసులు పాల్గొన్నారు.

