ఆదోని : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ వై.సాయి ప్రసాద్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఆదోనిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన “వెన్నుపోటుకు రెండేళ్లు” పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, పింఛన్‌దారులు ప్రభుత్వంపై తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు.రైతులకు రూ.20 వేల ఆర్థిక సహాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక వంటి కీలక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. అలాగే అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి “తల్లికి వందనం”గా ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ప్రయోజనం అందలేదన్నారు.ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలను కూడా బలహీనపరిచారని ఆరోపించిన ఆయన, ప్రజలకు ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాలను వివరించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా జూన్ 4న కూటమి మేనిఫెస్టో దహనం, జూన్ 8న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం, జూన్ 12న నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ వర్గాల లబ్ధిదారులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

