కడప : రూ.5 వేల లంచం కోసం కక్కుర్తిపడిన ఓ మహిళా వీఆర్వో ఉద్యోగం కోల్పోయి జైలు పాలైన ఘటన కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. 2018లో నమోదైన లంచం కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువడగా, నిందితురాలికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.2018లో కడప జిల్లా నుంచి చిలకలూరిపేట వరకు 765 కేవీడీసీ ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేయగా, దీనివల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించే ప్రక్రియ చేపట్టింది. ఈ క్రమంలో వల్లూరు మండలానికి చెందిన రైతు మల్లికార్జున రెడ్డి పంట నష్టపోవడంతో పరిహారం కోసం అప్పటి వీఆర్వో గంగమ్మను సంప్రదించారు.అయితే, పరిహారం ఫైల్‌ను తహసీల్దార్ కార్యాలయం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు పంపించే ప్రక్రియలో రూ.5 వేల లంచం ఇవ్వాలని గంగమ్మ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లంచం ఇవ్వడానికి నిరాకరించిన రైతు మల్లికార్జున రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో 2018 ఫిబ్రవరి 20న నిర్వహించిన ఉచ్చులో, రైతు నుంచి రూ.5 వేల లంచం తీసుకుంటుండగా వీఆర్వో గంగమ్మను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో వీఆర్వో గంగమ్మకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు రావడం గమనార్హం.ఇటీవల కాలంలో కడప జిల్లాలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు నిఘా పెంచినట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితం ఓ డిప్యూటీ తహసీల్దార్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై అనిల్ కుమార్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి.

