వి.మాడుగుల: చట్టాన్ని అమలు చేయడంలోనే కాకుండా, ఆపద సమయంలో మానవత్వాన్ని చాటడంలోనూ ముందుంటామని అనకాపల్లి జిల్లా పోలీసులు మరోసారి నిరూపించారు. PIT NDPS చట్టం కింద విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న నిందితుడు పెచ్చేటి రాజు అలియాస్ మహాలక్ష్మినాయుడుకు తన కుమారుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒక రోజు తాత్కాలిక విడుదల (పరోల్) కల్పించడం ప్రశంసలు అందుకుంటోంది.అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండగా, ఈ ఏడాది జనవరి 12న PIT NDPS చట్టం కింద అరెస్టై విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉన్నాడు.ఇదిలా ఉండగా, గత మే 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు పెద్ద కుమారుడు పెచ్చేటి సాయి కిరణ్ (17) మృతి చెందాడు. ఇప్పటికే మూడు సంవత్సరాల క్రితం చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించగా, ఇప్పుడు పెద్ద కుమారుడి మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.కన్నకొడుకు చివరి చూపుకైనా తండ్రిని తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు వి.మాడుగుల ఎస్ఐ నారాయణరావు, కె.కోటపాడు సిఐ కృష్ణను ఆశ్రయించారు. విషయాన్ని వెంటనే జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీ ఎల్. మోహన్ రావుకు తెలియజేయగా, వారు అత్యవసరంగా ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.ఎస్పీ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న జీవో జారీ చేసి, పెచ్చేటి రాజుకు ఒక రోజు తాత్కాలిక విడుదలకు అనుమతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు భద్రత నడుమ రాజు జూన్ 3న జంపెన గ్రామానికి చేరుకుని తన కుమారుడి అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.ఈ కష్ట సమయంలో మానవతా దృక్పథంతో స్పందించి, తండ్రికి తన కుమారుడిని చివరిసారి చూసే అవకాశం కల్పించినందుకు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, సిఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.పోలీస్ శాఖ కేవలం చట్ట అమలుకే పరిమితం కాకుండా, అవసరమైన సమయంలో మానవీయ కోణంలో స్పందించగలదని ఈ ఘటన మరోసారి నిరూపించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.


