ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరిక.. 25 వరకు అప్రమత్తం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం డిప్రెషన్‌గా మారింది. ఇది తదుపరి 24 గంటల్లో డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అనంతరం ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల వైపు కదిలి, సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజామున మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 22–25 వరకు వర్షాలు
IMD హెచ్చరికల ప్రకారం కోస్తాంధ్రలో సెప్టెంబర్ 22న భారీ నుంచి అతి భారీ వర్షాలు, 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, 25న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది.
ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం-మన్యం తదితర ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రజలకు సూచనలు
లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు, చెరువులు, వాగుల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు వాతావరణ పరిస్థితిని నిశితంగా గమనిస్తూ.. అధికారుల సూచనలు పాటించాలని IMD సూచిస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: