నేటి యువతకు స్ఫూర్తి భగత్ సింగ్

నేటి యువతకు స్ఫూర్తి భగత్ సింగ్

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం.. దాదాపు 100 మంది యువత రక్తదానం

ప్రొద్దుటూరు: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, రూరల్ సీఐ నాగభూషణం, ఆర్టీఓ నారాయణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడిగా దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ చిన్ననాటి నుంచే దేశభక్తి, స్వాతంత్ర్య భావాలతో పెరిగారని పేర్కొన్నారు.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా యువతను చైతన్యపరిచిన భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో చురుకుగా పనిచేశారని తెలిపారు. 1929లో బటుకేశ్వర్ దత్‌తో కలిసి ఢిల్లీలోని కేంద్ర శాసనసభలో బాంబులు విసిరిన ఘటన ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించారని వివరించారు.

1931 మార్చి 23న రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి భగత్ సింగ్‌కు బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందని గుర్తుచేశారు. ఆయన ధైర్యం, త్యాగం, దేశభక్తి నేటికీ భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం

వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు భగత్ సింగ్ స్ఫూర్తితో పనిచేస్తామని పేర్కొన్నారు.

భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది యువత రక్తదానం చేశారు. కార్యక్రమంలో కల్లూరు సుధాకర్ రెడ్డి (ఉప్పరపల్లె), వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నోవా, శేఖర్, ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *