తిరుమలలో నేడు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా గరుడ వాహన సేవ కోసం ప్రత్యేక చర్యలు, భక్తులకు భద్రతా సౌకర్యాలపై సమీక్ష జరగనుంది.
ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 24న ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు స్వయంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, తాగునీరు, వసతి, రవాణా వంటి సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించనున్నారు. అదేవిధంగా ఇతర పరిపాలనా అంశాలపై కూడా చర్చించి బోర్డు తీర్మానాలు చేయనుంది.

