నల్లగొండ జిల్లా పాక్సో ప్రత్యేక కోర్టు మరోసారి కఠిన తీర్పు వెలువరించింది. 2019లో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఒక మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కట్టంగూరు గ్రామానికి చెందిన జడిగల హరీష్‌కు 21 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధించింది.
జడ్జి రోజా రమణి విచారణ అనంతరం ఈ తీర్పు వెల్లడించారు. పాక్సో చట్టంలోని 376(2)(I) సెక్షన్ కింద నిందితుడు దోషిగా తేలడంతో కఠిన శిక్ష విధించబడింది.
ఈ కేసులో న్యాయస్థానానికి అవసరమైన శాస్త్రీయ ఆధారాలను సమర్పించడంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలోని పోలీసు బృందం కీలక పాత్ర పోషించింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడు తప్పించుకోలేకపోయాడు.
పాక్సో కోర్టు జడ్జి రోజా రమణి వరుసగా ఇలాంటి తీర్పులు వెలువరించడం సమాజానికి హెచ్చరికగా నిలుస్తుందని, ఇలాంటి తీర్పులు మరిన్ని నేరాలను అరికడతాయని సామాజిక వర్గాలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె తీర్పులకు ప్రశంసల వర్షం కురుస్తోంది.

