మానుకోట జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్ సేవలు రైతులకు ఆదర్శం.
మానుకోట, సెప్టెంబర్ 11:
ఇటీవలి ఇరవై రోజులుగా యూరియా కొరతతో రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వందలాది మంది రైతులు పంపిణీ కేంద్రాలకు పోటెత్తినా ఒక్కచోటా అల్లరి జరగకపోవడానికి కారణం, స్థానిక పోలీసులు క్రమశిక్షణతో నిర్వహించిన విధానమేనని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్ స్వయంగా ముందుండి పరిస్థితిని సమర్థంగా అదుపు చేశారు. ఆయన కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా, రాత్రి పగలు తేడా లేకుండా పంపిణీ కేంద్రాల్లో ప్రత్యక్షంగా డ్యూటీ చేశారు. రైతులకు టోకెన్లు పంచడం, బస్తాలు మోసే పనిలోనూ సిబ్బందితో పాటు పాల్గొన్నారు.
రైతుల ఆవేశాన్ని శాంతింపజేసేందుకు ఆయన స్వయంగా మైకు పట్టుకుని మాట్లాడడం, వృద్ధ రైతులకు ధైర్యం చెప్పడం రైతుల్లో విశ్వాసం కలిగించింది. “నాయకత్వం అంటే నడిపించడమే కాదు, కలిసి నడవడమని నిరూపించారు” అంటూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటనతో పోలీస్ శాఖపై రైతులకు కొత్త నమ్మకం ఏర్పడిందని ప్రజలు పేర్కొంటున్నారు. “భవిష్యత్తులో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సత్తా ఈ ఎస్పీకి ఉందని ఈ సంఘటన చూపించింది” అని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు.
“మీ సేవకు సలాం, మా హృదయపూర్వక అభినందనలు” అంటూ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

