కడప / మైదుకూరు,రైతులను మభ్యపెట్టి రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సరికాదని మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి రైతుల సమస్యలను పరిష్కరించే బదులు వారిని రాజకీయంగా ఉసిగొల్పుతున్నారని ఆయన ఆరోపించారు.అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బంది పడుతుంటే, వారిని పరామర్శించాల్సింది పోయి “రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అంటూ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విధంగా మాట్లాడడం రైతులను నిరుత్సాహపరచే చర్య అని ఆయన అన్నారు.గత ప్రభుత్వ కాలంలో ఆదిరెడ్డిపల్లె రెవెన్యూ పరిధిలో కేవలం 600 ఎకరాల పంట నమోదు మాత్రమే జరిగిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1000 ఎకరాలకు పైగా పంట నమోదు కార్యక్రమం పూర్తయిందని తెలిపారు.రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ప్రవేశపెట్టినది చంద్రబాబు నాయుడు గారేనని గుర్తు చేశారు. యూరియా వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుందని శాస్త్రవేత్తల సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు రెక్కలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపిస్తున్నదని రవీంద్ర తెలిపారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50 వేల నష్టపరిహారం ప్రకటించడం రైతు పక్షపాత ధోరణికి నిదర్శనమని అన్నారు.మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వంలో ఇప్పటివరకు మండలంలో 8,800 ఎకరాల పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. రైతులు ఈ నెల 25లోపు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని సూచించారు.“మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు వేగంగా రైతు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు” అని రవీంద్ర తెలిపారు.
(ఏపీ రవీంద్ర మార్కెట్ కమిటీ చైర్మన్, మైదుకూరు)

