మూడోవంతు యూపీఐ చెల్లింపులు అసురక్షితంగానే.. డాట్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలలో సుమారు మూడోవంతు వరకు అసురక్షితంగా ఉన్నాయని టెలికాం విభాగం (DoT) పేర్కొంది. ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) ఇప్పటివరకు ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) వ్యవస్థలోకి చేరలేదని టెలికాం సెక్రటరీ నీరజ్ మిత్తల్ వెల్లడించారు.
యూపీఐ ద్వారా జరగుతున్న కోట్లాది లావాదేవీలను సురక్షితంగా ఉంచేందుకు రూపొందించిన ఈ FRI వ్యవస్థ వలన ఫోన్ నంబర్‌లను రిస్క్ స్థాయిల ఆధారంగా వర్గీకరిస్తారు. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి వినియోగదారులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం ఈ వ్యవస్థ లక్ష్యం.
అయితే, గూగుల్ పే ఇప్పటివరకు ఈ రక్షణ వ్యవస్థలో చేరకపోవడం వల్ల సుమారు మూడోవంతు UPI లావాదేవీలు ఈ రక్షణకు లోబడి లేవని డాట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌లు ఇప్పటికే ఈ వ్యవస్థలో చేరి యూజర్లకు అదనపు భద్రత అందిస్తున్నాయని తెలిపారు.
నీరజ్ మిత్తల్ మాట్లాడుతూ —> “UPI వ్యవస్థ భద్రతను పెంచడమే మా లక్ష్యం. అన్ని పేమెంట్ అగ్రిగేటర్లు FRI సిస్టమ్‌లో చేరి ఫ్రాడ్ రిస్క్‌ను తగ్గించాలి” అన్నారు.
దేశవ్యాప్తంగా రోజుకు కోట్లాది రూపాయల విలువైన యూపీఐ లావాదేవీలు జరుగుతుండగా, ఈ వ్యవస్థలోని లోపాలు సైబర్ మోసాలకు అవకాశం కల్పిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

