తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు జయంత్ సి పరంజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, సినిమాల విజయాలు–విఫలాలు తనను ఎప్పుడూ కుంగదీయలేదని ఆయన వెల్లడించారు.తాను ఎప్పుడూ ఆనందంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని, సినిమా ఫ్లాప్ అయినా లేదా ఆర్థికంగా నష్టపోయినా తీవ్రంగా బాధపడే స్వభావం కాదని జయంత్ తెలిపారు. చిన్నప్పటి నుంచే తన మానసిక ధోరణి అలానే ఉందని చెప్పారు.తన దర్శకత్వంలో వచ్చిన టక్కరి దొంగ కమర్షియల్‌గా పెద్ద ఫ్లాప్ అయిందని గుర్తుచేసుకున్న ఆయన, ఆ సినిమా వల్ల ఆర్థికంగా తీవ్ర నష్టం ఎదురైందన్నారు. “ఆ నష్టం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. సంపాదించిన ప్రతి రూపాయి అప్పులు తీర్చడానికే వెళ్లింది” అని చెప్పారు. అయినప్పటికీ ఆ వైఫల్యం తనను నిరాశకు గురిచేయలేదని, ‘టక్కరి దొంగ’ తర్వాత వెంటనే ఈశ్వర్ షూటింగ్‌కు వెళ్లానని, మరో సినిమా పనులు కూడా ప్రారంభించానని వెల్లడించారు.కళలంటే తనకు చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన ఇష్టమని జయంత్ సి పరంజీ తెలిపారు. బొమ్మలు వేయడం, పెయింటింగ్‌లు చేయడం తనకు అలవాటని, ఇప్పటికీ తన తల్లి వద్ద తన వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్‌లు ఉన్నాయని చెప్పారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు తరచూ హాజరవుతుండేవాడినని తెలిపారు.తన ఇంట్లో బాలీవుడ్, హాలీవుడ్ పోస్టర్లు కనిపించినా తెలుగు సినిమాల పోస్టర్లు లేకపోవడానికి కారణం కూడా వెల్లడించారు. మాయాబజార్, ముత్యాల ముగ్గు చిత్రాల ఒరిజినల్ పోస్టర్ల కోసం ఎంతో ప్రయత్నించినా దొరకలేదని చెప్పారు. ముఖ్యంగా ‘ముత్యాల ముగ్గు’ సినిమాను థియేటర్లలో పలుమార్లు చూసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.దర్శకుడు కె. విశ్వనాథ్ సినిమాలంటే తనకు అపారమైన గౌరవమని, లక్ష్మీ నరసింహా సినిమాలో ఆయనను డైరెక్ట్ చేయడం తన కెరీర్‌లో ఓ ప్రత్యేక ఘట్టమని తెలిపారు. అలాగే శంకరాభరణం కన్నా సిరిసిరి మువ్వ, సీతామహాలక్ష్మి చిత్రాల్లో ఎక్కువ ఆత్మ కనిపించిందని విశ్వనాథ్‌తో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.ఇక భారతీయ, అంతర్జాతీయ సినిమాలపై తనకున్న ఆసక్తిని వివరిస్తూ, దర్శకులు శ్యామ్ బెనెగల్, బీమల్ రాయ్ చిత్రాలతో పాటు అమర్ అక్బర్ ఆంథోనీ వంటి కమర్షియల్ చిత్రాలను కూడా ఇష్టంగా చూసేవాడినని తెలిపారు. అలాగే అందాల రాముడు తనకు ఎంతో ఇష్టమైన చిత్రాల్లో ఒకటని చెప్పారు.
previous post

