ఏపీలో పేకాట శిబిరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా…డీజీపీని నివేదిక సమర్పించాలని ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న పేకాట శిబిరాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పేకాట కేంద్రాల నిర్వహణపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నాయి.వివిధ జిల్లాల ప్రజలు పంపిన ఫిర్యాదుల్లో కొందరు ప్రముఖులు పేకాట కేంద్రాలు నిర్వహిస్తూ, నెలవారీ మామూలు పేరుతో అధికారులకు లంచాలు అందజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో జూదం నిర్వహించడం, పాల్గొనడం రెండూ నేరమని ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్, 1974 స్పష్టంగా పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఆరా తీశారు.పోలీసు అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి పవన్ కల్యాణ్ ఆదేశించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

