ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ (1800 599 5991) ను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి స్వయంగా టెలికాలర్‌గా వ్యవహరించి ప్రజల ఫోన్ కాల్స్‌కు సమాధానమిచ్చారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలానికి చెందిన ఒక లబ్ధిదారు బేస్‌మెంట్ వరకు ఇల్లు పూర్తయినా బిల్లు రాలేదని చెప్పగా, మంత్రిగారు ఆధార్ నెంబర్ తీసుకొని కంప్యూటర్‌లో వివరాలు పరిశీలించి, వచ్చే సోమవారం నాటికి ఒక లక్ష రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయని హామీ ఇచ్చారు.
మరో కాలర్ హైదరాబాద్‌లో ఇళ్ల కేటాయింపు గురించి అడగగా, నివాస స్థలాల కొరత కారణంగా కొంత ఆలస్యం జరిగిందని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, ఈ కాల్ సెంటర్ ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని, లబ్ధిదారులు బిల్లుల జమలో ఆలస్యం, ఫోటో అప్‌లోడ్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు, అవినీతి వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. సంబంధిత అధికారుల ద్వారా వాటిని వెంటనే పరిష్కరించి లబ్ధిదారులకు సమాచారం అందిస్తామన్నారు.
ఇందిరమ్మ పథకంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, సాంకేతిక పరిజ్ఞానం, ఇందిరమ్మ యాప్, కృత్రిమ మేధ (AI) వినియోగంతో పనులు జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు ₹5 లక్షల సబ్సిడీతో ఇళ్లు కట్టేందుకు సహాయం అందిస్తున్నామని తెలిపారు.

