ఓటుకు నోటు కేసులో A4 ముద్దాయిగా ఉన్న జెరూసలెం మత్తయ్య మరోసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన కేసులో తాను దోషి కాదని, వాస్తవానికి బాధితుడినే అని స్పష్టం చేశారు.
“సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారికి అన్నీ చెప్పేస్తా. నన్ను అప్పటి ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ వద్దకు పంపింది ఎవరో చెబుతా. నా దగ్గరున్న అన్ని ఆధారాలు బయటపెడతా” అని మత్తయ్య పేర్కొన్నారు.
ఈ కేసులో ఇరుకున్న పలువురు తర్వాత పదవులు, రాజకీయ లాభాలు పొందారని, అందరూ సంతోషంగా ఉన్నారని, కానీ తానే మాత్రం ఇప్పటికీ సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అయినా నేను వెనకడుగు వేయను. నా పోరాటంలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులకైనా భయపడేది లేదు” అని మత్తయ్య ధీమాగా అన్నారు.
జెరూసలెం మత్తయ్య వ్యాఖ్యలు ఓటు నోటు కేసుకు మళ్లీ ప్రాధాన్యత తెచ్చి పెట్టాయి. ఇకపై సుప్రీంకోర్టులో ఆయన ఏం చెబుతారన్నదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

