వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం సాధించే వరకు వెనుదిరగబోమని వైఎస్ సునీత మరోసారి స్పష్టం చేశారు. ఆమె తాజాగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసు విచారణను తిరిగి కొనసాగించాలని, ఇప్పటికీ అసలు సూత్రధారులు వెలుగులోకి రాలేదని ఆమె కోర్టును కోరారు.
సీబీఐ కోర్టు న్యాయమూర్తి సునీత పిటిషన్‌ను స్వీకరించి, నిందితులకు పిటిషన్ కాపీలు అందేలా చూడాలని ఆదేశించారు.
గతంలో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తుకు పూర్వ ప్రభుత్వం ఆటంకాలు కలిగించిందని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దర్యాప్తును కొనసాగించేందుకు కోర్టు అనుమతిస్తే ముందుకు వెళ్తామని సీబీఐ స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించి, ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు సునీత ఇప్పుడు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. “నా తండ్రి హత్యకు న్యాయం జరిగే వరకు నేను ఆగను,” అని ఆమె స్పష్టం చేశారు. జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కేసు తేలుతుందనే నమ్మకం పెట్టుకున్నానని, కానీ అది జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ట్రయల్ దశకు రాకపోవడం, ప్రధాన సూత్రధారులు బయటపడకపోవడం పట్ల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

