కడప జిల్లా, మైదుకూరు :మైదుకూరు ఎమ్మెల్యే చొరవతో మార్కెట్ కూడలిలో నెలలుగా ఉన్న అడ్డంకి తొలగింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కూడా ప్రస్తుతం నీరు నిలవని విధంగా ఏర్పాట్లు చేయడం స్థానిక ప్రజలను సంతోషపరుస్తోంది.గతంలో కొద్దిపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితి నెలకొనేది. అయితే, తాజాగా చేపట్టిన మరమ్మతులతో మార్కెట్ కూడలి ప్రాంతంలో నీరు నిలిచే సమస్య పూర్తిగా తొలగిపోయిందని వాహనదారులు చెబుతున్నారు.అయితే, మునిసిపల్ అధికారులు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు మీద ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు. కడప రోడ్డులో ఒక గుంత మాత్రమే పూడ్చి మిగతావి వదిలేయడం గమనార్హమని వారు అంటున్నారు. అదే యంత్రంతో మిగతా గుంతలను కూడా పూడ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.ఇటీవల పోలీసులు మట్టితో పూడ్చించిన గుంతలు వర్షాల కారణంగా మళ్లీ తెరుచుకున్నాయి. ఈసారి సిమెంట్ కాంక్రీట్‌తో శాశ్వత పరిష్కారం చేపట్టాలని ప్రజలు మునిసిపల్ అధికారులను కోరుతున్నారు.
previous post

