అమరావతి:
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయింది. ఈ సందర్భంలో కూటమి బలం, సమన్వయాన్ని ప్రజల ముందుకు చాటిచెప్పేందుకు ఈనెల 10వ తేదీ (బుధవారం) అనంతపురం వేదికగా “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” పేరుతో భారీ ప్రజాసభ నిర్వహించేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి.
2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి, అప్పటినుండి పదవుల పంపకంలోనూ, పాలనలోనూ కలిసి ముందుకు సాగుతోంది. క్షేత్ర స్థాయిలో చిన్న విభేదాలు తప్ప పెద్ద సమస్యలు లేకపోవడం, ముఖ్యనేతలు తరచుగా ఉమ్మడి కార్యక్రమాల్లో పాల్గొనడం కూటమి బలాన్ని చూపుతున్నాయి.
ఈ సభలో గత 15 నెలల్లో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించనున్నారు. “కూటమి మరింత కట్టుదిట్టమైన బంధంతో, ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్న” సంకేతం ఇవ్వడమే ఈ సభ ఉద్దేశ్యం.
కేంద్ర నేతలతోపాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీకి ఏ మాత్రం అవకాశమూ ఇవ్వకుండా, కూటమి బలంగా నిలబడేందుకు ఈ సభను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోనున్నారు.
అనూష

