వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో అటవీ శాఖలో అవినీతి కలకలం రేపింది. గోవిందాపురం ఫారెస్ట్ బీట్ అధికారి శోభన్ బాబు విధుల నుండి సస్పెండ్ అయ్యారు.
పొడు దారులతో కుమ్మక్కై అడవిని నరికి, కొత్తగా పోడు చేయించడంలో ఆయనకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై నర్సంపేట ఎస్ఆర్వో రవికిరణ్ దర్యాప్తు జరిపి, కొందరు పోడు రైతుల వాంగ్మూలాలు, నగదు లావాదేవీల వివరాలు సేకరించారు.
విచారణ అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్‌కు నివేదిక సమర్పించగా, అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత బీట్ అధికారి శోభన్ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అటవీ వనరుల పరిరక్షణలో కీలకమైన ఫారెస్ట్ బీట్ అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

