మంగళగిరి, సెప్టెంబర్ 12 (ప్రజాశక్తి):
తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలకు నీటి కాలుష్యమే కారణమని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కె.వి.ఎస్. సాయిప్రసాద్ స్పష్టం చేశారు.
ఇటీవలి కాలంలో ఆ గ్రామంలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజా ఆరోగ్య వేదిక బృందం గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా డాక్టర్ సాయిప్రసాద్ మాట్లాడుతూ – “క్వారీలు పగలగొట్టేటప్పుడు వేసిన మందుల రసాయనాలు నీటిలో కలవడం వల్లే ఈ వ్యాధులు వ్యాప్తి చెందాయి. కలుషిత నీరు తాగడం వలన గ్రామస్తుల్లో జ్వరం, కీళ్లవాపు, కణుతులు, మెడ–పొట్ట దగ్గర గడ్డలు వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలామంది సర్జరీ చేసినప్పటికీ బతకాలేకపోయారు” అని తెలిపారు.
ఇలాంటి విషయంలో మతం, విశ్వాసాలకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యాధికి గురయ్యారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అత్యవసరంగా రక్షిత నీటి సరఫరా ఏర్పాటు చేసి, గ్రామ ప్రజలకు యాంటీబయోటిక్ మందులు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

