ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే రాష్ట్రస్థాయి జూనియర్ బాల, బాలికల కబడ్డీ పోటీలకు ముందు ఎంపికైన ఆటగాళ్లకు శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి.
గత 14వ తేదీన నంద్యాల ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లోనుంచి 20 మంది బాలికలు, 20 మంది బాలురను ఎంపిక చేశారు. అయితే తుది జట్టుకు 14 మంది మాత్రమే ఉండాల్సి ఉండడంతో, ఎంపికైన ఆటగాళ్లకు శిక్షణా శిబిరం ప్రారంభించారు.
🔹 బాలికల విభాగం – పాణ్యం మండలంలోని విజయానికేతన్ పబ్లిక్ స్కూల్‌లో
🔹 బాలుర విభాగం – గడివేముల మండలం ZPHS హైస్కూల్‌లో
ఈ శిక్షణ శిబిరం ఈ నెల 23 వరకు కొనసాగుతుంది. 24వ తేదీ రాత్రి జట్లు విజయవాడ బయలుదేరుతాయి. 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో 26 జిల్లాల రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా విజయానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ కె. విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ “విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు సాధించండి” అని సూచించారు. ఆటగాళ్లకు ఉచిత వసతి, భోజన వసతులు కల్పించినందుకు ఆయనను బాలికలు సత్కరించారు.
మండల విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ “క్రీడాకారులు చదువులోనూ మెరుగుపడుతూ, ఉద్యోగావకాశాల కోసం 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి” అని సూచించారు.

