అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నాలుగు కుళాయిల వద్ద వరద ప్రవాహంలో ఒక ఆటో బోల్తా పడింది.
ఆటోలో ప్రయాణిస్తున్న ఆరేళ్ల పాప నీటిలో కొట్టుకుపోయింది. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, పాప ఆచూకీ లభ్యం కావడంతో హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. చివరకు పాత రాయచోటి బ్రిడ్జి దగ్గర పాప మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈ దుర్ఘటనతో రాయచోటి పట్టణం అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మరణం స్థానికులను కలచివేసింది.
ఇదే సమయంలో, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాయచోటి టిడిపి ఇంచార్జి మండపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. కుటుంబానికి తనవంతు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
వరదలో అమాయక పాప ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక ప్రజలు విచారం వ్యక్తం చేస్తూ, అధికారులు వరద నియంత్రణ చర్యలు మరింత బలోపేతం చేయాలని కోరుతున్నారు.

