గాజాలో శాంతి స్థాపన దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలోని కొన్ని షరతులకు పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ అంగీకారం తెలిపింది. ఇందులో యుద్ధ విరమణ, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ, బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల మార్పిడి, సహాయ కార్యక్రమాల పునరుద్ధరణ వంటి అంశాలు ఉన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు: “గాజాలో శాంతి ప్రయత్నాలు కీలక పురోగతి సాధిస్తున్న తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని మేము స్వాగతిస్తున్నాము. బందీల విడుదల దిశగా వస్తున్న సంకేతాలు ఒక ముఖ్యమైన ముందడుగు. శాశ్వత శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుంది” అని తెలిపారు.
అంతకుముందు ట్రంప్, ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు శాంతి ప్రణాళికను అంగీకరించాలని హమాస్‌కు అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ గడువుకి ముందే హమాస్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

