హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు రెండో ఏడాది వరుసగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాలు, ఉత్పత్తి, విజయాల ఆధారంగా 34% బోనస్ ప్రకటించబడింది.
మొత్తం బోనస్: ₹819 కోట్లు
ప్రతి కార్మికుడికి లబ్ధం: ₹1,95,610
కాంట్రాక్ట్ కార్మికులు: ₹5,500 ప్రతి ఒక్కరికి (గతేడాది ₹5,000)
ప్రయోజనం పొందే కార్మికులు: సుమారు 71,000 మంది
లాభాలు 2024–25 ఆర్థిక సంవత్సరం: 6,394 కోట్లు
4,034 కోట్లు: సంస్థ విస్తరణ
2,360 కోట్లు: కార్మిక సంక్షేమ, బోనస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల శ్రమ, త్యాగం తెలంగాణ సాధనలో ప్రత్యేకమైనది అని, వారి కృషి వల్లే పరిశ్రమలు లాభసాటిలో నడుస్తున్నాయని తెలిపారు.
భవిష్యత్తులో లాభాల్లో వాటాలను కార్మికులకు పంచుతూ, సంస్థ విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలను కార్పొరేట్ రంగంతో పోటీకి సిద్ధం చేయాలని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో కోల్పోయిన రెండు గనులను తిరిగి సింగరేణి ఆధ్వర్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.
జీఎస్టీ సవరణల కారణంగా రాష్ట్రం దాదాపు 7,000 కోట్లు నష్టం వహించిందని, ఆ నష్టాన్ని కేంద్రం భరించాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాలు, అధికారులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

