జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నేలపాడులోని హైకోర్టు ప్రథమ కోర్ట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనను ప్రమాణం చేయించారు.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ స్వస్థలం ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం. న్యాయవిద్య అనంతరం 2002లో జిల్లా జడ్జిగా నియమితులై తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సేవలందించారు.
2015 జూలైలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, 2019 జూన్‌లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2023 నవంబర్‌లో గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనవారిలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు మరియు హైకోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

