బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం కొత్త చర్చలకు దారితీసింది. హరీష్ రావు, సంతోష్ రావుపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కవిత మాత్రం సస్పెన్షన్ పట్ల పెద్దగా స్పందించకుండా తన స్వంత రాజకీయ భవిష్యత్తుపై దృష్టి సారిస్తున్నారు. అయితే ఈ పరిణామాల వల్ల ప్రధానంగా హరీష్ రావుపైనే మరక పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఆరోపణల వర్షం.
హరీష్ రావుపై సోషల్ మీడియాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు పెద్దగా ఆస్తులు లేని ఆయన.. ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారన్న ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. కవిత అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ డిమాండ్‌ను మరింతగా రగిలిస్తున్నారు.
పార్టీ నేతల మౌనం
హరీష్ రావు నిజాయితీ పరుడు అని, ఆయనపై కవిత ఆరోపణలు తప్పుడు అని బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. కవితను సస్పెండ్ చేయడం ఆయనకు మద్దతు తెలిపినట్లే అనుకున్నా, స్పష్టమైన క్లీన్ చిట్ ఇవ్వకపోవడం వెనుక వర్గపోరు ఉన్నట్లు అనిపిస్తోంది.
భవిష్యత్తు సవాళ్లు
ఇప్పటికి ఆయనకు మద్దతుగా కనిపించినా, భవిష్యత్తులో హరీష్ రావు పరిస్థితి కష్టమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉండటంతో, హరీష్ బాధ్యతలు తగ్గి.. చివరికి సిద్ధిపేటకే పరిమితం కావచ్చని విశ్లేషకుల అంచనా.
రాజకీయ విశ్లేషకుల మాటల్లో.. “కవిత ఆరోపణలు బీఆర్ఎస్‌ను చాలా కాలం వెంటాడతాయి. హరీష్ రావుపై మరక పూర్తిగా తుడిచిపెట్టకపోతే, ఆయన భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశమే ఎక్కువ” అని వ్యాఖ్యానిస్తున్నారు.

