కడప జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తున్న కోచింగ్ సెంటర్లుఅనుమతులు లేకుండా విద్యా వ్యాపారం – అధికారులు కళ్ళుమూశారు
కడప జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. విద్యా శాఖ నుండి గుర్తింపు లేకుండానే కొంతమంది వ్యక్తులు వ్యాపార ధోరణిలో ఈ సెంటర్లను నడుపుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు.
ప్రత్యేకించి కడప,బద్వేలు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు పట్టణాల్లో అనేక కోచింగ్ సెంటర్లు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. తరగతులు నిర్వహించే గదులు తగిన సదుపాయాలు లేకుండా, గాలి ప్రసరణ, భద్రతా ప్రమాణాలు లేని పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి.విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ, అనధికారంగా నడుస్తున్న ఈ సంస్థలపై అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసు విభాగం కలిసి ఈ కోచింగ్ సెంటర్లపై తక్షణమే తనిఖీలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

