కారంపూడి పట్టణంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర మెడికల్ స్టోర్ యజమాని, బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి హనుమంతరావును మత్తుమందు బిళ్లల అక్రమ రవాణా కేసులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన కుమారుడు శెట్టి జయ రామచంద్ర ప్రసాద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ ఇద్దరు యువకులు శెట్టి హనుమంతరావు మెడికల్ స్టోర్ నుంచి స్పాస్మో-ప్రోక్సివాన్ ప్లస్ అనే మత్తుమందు బిళ్లలను భారీగా కొనుగోలు చేసి, తెలంగాణలో యువతకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు దర్యాప్తులో బయటపడింది.ఈదులగూడెం కూడలిలో సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు వారి వాహనాన్ని ఆపి తనిఖీ చేసినప్పుడు మత్తుమందు బిళ్లలు లభ్యమయ్యాయి. ప్రశ్నించగా కారంపూడి పట్టణంలోని శెట్టి హనుమంతరావు మరియు అతని కుమారుడు రవాణాకు సహకరిస్తున్నట్లు వారు వెల్లడించారు.దీనిపై చర్యగా తెలంగాణ పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని కుమారుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

